04-Feb-2024 – ప్రార్థన కొరకైన సమయము నీవు కలిగిఉన్నావా?

Published by Sunil Binkam on

అందుకాయన–(ఉపవాస)ప్రార్థనవలననే గాని మరి దేనివలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను – మార్కు 9:29

“నీవు కలిగి ఉన్నావా” అనే అంశము ద్వారా ఈరోజు మన జీవితము పరీక్షించుకొని ఆయన మహిమ ప్రత్యక్షపరచబడునట్లుగా సిద్ధపడటం కొరకు మరొక అవకాశము ఇచ్చినాడు. మనము చూసిన వాక్యములో మూగ దెయ్యముతో బాధింపబడుతున్న తన కుమారుని స్వస్థ పరచమని ఒక తండ్రి యేసయ్య శిష్యుల వద్దకు వచ్చారు. ఆ సమయములో యేసయ్య పేతురు, యోహాను, యాకోబు లతో రూపాంతర కొండపై ఉన్నారు. మిగిలిన శిష్యులు ఆ దెయ్యమును వెళ్లగొట్టలేక పోయారు.

నిజానికి ఆ 12 మంది శిష్యులకు అపవిత్రాత్మలపై అధికారమును యేసయ్య ఇచ్చారు.

‭ పండ్రెండుగురు శిష్యులను తనయొద్దకు పిలిచి, వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు, అపవిత్రాత్మలమీద వారి కధికారమిచ్చి – మార్కు 6:7

శిష్యులకు బాదింపబడుతున్న శరీరమునుండి వెళ్లగొట్టునట్లుగా అపవిత్రాత్మలపై అధికారము ఉన్నప్పటికీ వారు ఆ కార్యము జరిగించలేని స్థితిలో ఉన్నారు. ఆ సంఘటన జరిగిన తరువాత యేసయ్య వారికి ఒక మర్మము తెలియచేసారు. ఉపవాస ప్రార్థన ద్వారానే ఇది సాధ్యమవుతుంది అని.

ప్రార్థన అనేది సామాన్యముగానే బలమైనది అని మనము ఎరిగి ఉన్నాము. పాత నిబంధన గ్రంధములో 1 రాజులు 8 అధ్యాయములో చూస్తే, దేవాలయమును ప్రతిష్టించే సమయములో సొలొమోను చేసిన ప్రార్థన ఏమిటి అంటే, దేవుని ప్రజలు ఏ పరిస్థితిలలో ఉన్నా సరే వారు దేవుని తట్టు తిరిగి చేసే ప్రతి ప్రార్థన అంగీకరించుమని, వారిని ఆయా వ్యతిరేక పరిస్థితులనుండి తప్పించమని. ఆ ప్రార్థనను ప్రభువు అంగీకరించారు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు తమ శ్రమలలో మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను విన్నాడు. ఒక్కోసారి గద్దించి అయినా సరే తిరిగి వారి ప్రార్థనను విన్నాడు. హన్నా ప్రార్థన, దావీదు ప్రార్థన, ఏలియా ప్రార్థన, యోబు ప్రార్థన ఇలా అనేకుల ప్రార్థన దేవుడు విని ఉత్తరమిచ్చినవాడుగా ఉన్నాడు.

ఇప్పుడు మనము నూతన నిబంధనలో ఉన్నాము. దేవునికి ప్రార్థించుటలో అబ్బా తండ్రీ అని ప్రార్థించే అధికారము యేసయ్య మనకు అనుగ్రహించారు. అలాగే యాకోబు గ్రంథములో మనము నీతిమంతుని ప్రార్థన బహు బలము కలది అని నేర్చుకున్నాము.

అయితే ఈ వచనములో చెప్పబడిన ప్రార్థన కేవలము అడిగినది పొందుకోవడానికి మాత్రమే కాదు గానీ, దానికంటే మించినది గా ఉంది. ఇది ఇవ్వబడిన అధికారమును వినియోగించుటకొరకైన సిద్ధపాటుగా కనపడుచున్నది. యేసయ్య జీవితమును గమనించినట్టయితే, ఆయన ఒంటరిగా ప్రార్థనలో గడిపిన సమయములు అనేకములు. ప్రతి రాత్రి కొండపై ఏకాంతముగా ప్రార్థన చేసిన అనుభవము యేసయ్యది. ఏనాడు ఆయన తనకు ఇవ్వబడిన అధికారమును వినియోగించుటలో విఫలము కాలేదు.

ఈరోజు తన శిష్యులతో మాట్లాడుతున్న మాటలే మనతో కూడా మాట్లాడుచున్నాడు. యేసు నామములో దేవుడు మనకు కూడా అధికారము ఇచ్చాడు. మారు జన్మ పొందిన దేవుని బిడ్డలుగా, యేసు రక్తములో కడుగబడినవారిగా, పరిశుద్ధాత్మ మనయందు నివసించుటను బట్టి శక్తివంతముగా చేయబడిన జీవితములు మనవి. యేసు నామములో సమస్తముపై మనకు అధికారము ఇవ్వబడింది. ఎందుకంతే, పరలోకమైనా భూలోకమైనా అన్ని నామములకన్నా పై నామము యేసయ్యకు ఇవ్వబడింది. ఆ నామములో సమస్తమును పొందుటకు ఆ నామము మన కొరకై అనుగ్రహించబడింది.

అయితే ఆ నామములోని అధికారమును మన దైనందిన జీవితములలో అనుభవించడానికి, వినియోగించడానికి మనము మనలను సిద్ధపరచుకోవాలి. ఇది మన కండరములను శక్తివంతముగా చేసికొనుటకు వ్యాయామము చేయుటతో పోల్చవచ్చు. ప్రార్థన మనకు ఇవ్వబడిన అధికారము మన జీవితములలో కార్య రూపము దాల్చుటలో సహాయపడుతుంది. అందుకే ప్రార్థనకు సమయము కేటాయించలేకుండా అపవాది అనేకమైన ఆటంకములు కల్పిస్తుంది. అనేకమైన వాటికి సమయము ఉంటుంది కానీ, ప్రార్థనకు ఆరాధనకు సమయము ఉండదు. ఈ రెండు ఒక విశ్వాసి జీవితములో ఎంతో ప్రాముఖ్యమైనవి. అయితే ఈరోజు ప్రార్థన గూర్చి ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు.

నీకు ఇవ్వబడిన అధికారమును వినియోగించుటకొరకు సిద్ధపడులాగున ప్రార్థన కొరకైన సమయము నీవు కలిగిఉన్నావా? నీవు కలిగి ఉంటే నీవు ధన్యుడవు. ఒకవేళ కలిగి లేకపోతే, భయపడకు. ఈరోజు దేవుడు మాట్లాడినదే మరొక అవకాశము ఇవ్వడానికి. నీ ప్రార్థన జీవితమును నూతనపరచు. కేవలము దేవునిని ఎదో ఒకటి అడగటానికి మాత్రమే కాదు గానీ, యేసు నామములో నీకివ్వబడిన అధికారమును వినియోగించులాగున బలపరచబడటానికి.

ప్రార్థన

ప్రేమ కలిగిన పరలోకపు తండ్రీ, నీ ప్రేమ మరియు కృపల కొరకై నీకే వందనములు. ఈరోజు ఒక శక్తివంతమైన విషయము మీరు నేర్పించారు. నీ నామము కొరకై శక్తివంతముగా గొప్పగా జీవించడానికి అవసరమైన సిద్ధపాటుకొరకైన మాటలు అందించారు. ప్రభువా నీ కొరకైన బలమైన సాక్షిగా సిద్ధపడులాగున నా ప్రార్థన జీవితాన్ని సరిచేసుకోవడానికి సహాయము చెయ్యండి. యేసు నామములో అడిగి వేదుకొనుచున్నాము తండ్రీ, ఆమేన్!


0 Comments

Leave a Reply

Avatar placeholder

Your email address will not be published. Required fields are marked *