03-Feb-2024 – అచంచలమైన పట్టుదల, దృఢనిశ్చయత కలిగి ఉన్నావా?

అందుకు యేసు –అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను – మత్తయి 15:28
ఈరోజు కొరకైన వాక్యము మనకు బాగా సుపరిచితమే. విశ్వాసము యొక్క గొప్పతనము, శక్తి గూర్చిన అనేకమైన వర్తమానములలో మనము ఈ భాగమును గూర్చి వినే వుంటాము. ఈ భాగము మొత్తాన్ని ధ్యానించినపుడు, ఈ స్త్రీ కనానీయురాలు అనగా విగ్రహారాధికురాలు. యేసుతో ఏ సంబంధము లేని ఒక అన్యురాలు. అయినప్పటికీ, యేసు స్వస్థపరచగలరు అని నమ్మి యేసయ్య దగ్గరకు వచ్చింది.
ఆమె తన కుమార్తె యొక్క దుర్భర పరిస్థితులలో స్వస్థత కొరకు యేసయ్య వద్దకు వచ్చింది. మొదట్ యేసయ్య ఆమెను అసలు పట్టించుకోలేదు. అయినా పట్టువదలక స్వస్థపరచమని వేడుకుంటూనే ఉంది. అయితే ఆమె భారముతో కూడిన రోదన శిష్యులకు అసహనమును కలిగించింది. వారు యేసయ్యతో ఆమెను పంపివెయ్యమని చెప్పారు.
అప్పుడు యేసయ్య తాను ఇశ్రాయేలు ఇంటివారి కొరకే పంపబడ్డాను అని చెప్పాడు. అంటే దాని అర్థం, ఆ స్త్రీ ఎదురు చూస్తున్న తన కుమార్తె స్వస్థత యేసయ్య వద్దనుండి పొందుకొనే అవకాశము ఆమెకు లేదు అనే కదా! అయినప్పటికీ ఆమె వెళ్ళిపోలేదు. అయితే ఈసారి యేసయ్యకు మ్రొక్కుతూ వేదుకుంది.
అప్పుడు యేసయ్య పిల్లల రొట్టె కుక్కపిల్లలకు వేయుట యుక్తముకాదు అని చెప్పారు. అనగా ఆమెను ఒక కుక్కతో సమముగా చేసినట్టే కదా? మరొకరైతే యేసయ్యను అవమానపరచి పెద్ద విషయము చేసేసేవారే. అయితే ఈమె ఏ మాత్రము ఆలోచించకుండా అవును ప్రభువా కుక్కపిల్లలు కూడా పిల్లల బల్లమీదనుండొ పడే రొట్టెముక్కల కొరకు ఆశపడతాయి కదా అని చెప్పేసరికి, యేసయ్య మాట్లాడే విధానము మారిపోయింది. అమ్మా! అని పిలిచి, నీ విశ్వాసము ఎంతో గొప్పది, నీ కుమార్తె స్వస్థతనొందినది అని చెప్పారు.
ఈ భాగములో ఆమె విశ్వాసముతోపాటు కనపరిచిన ముఖ్యమైన లక్షణములు ఏమిటి అంటే, అచంచలమైన పట్టుదల మరియు దృఢనిశ్చయత. అచంచలమైన పట్టుదల అనగా అడ్డంకులు, అవమానములు ఎదురైనా, పరిస్థితి అనుకూలముగా లేకపోయినా సరే చేపట్టిన, నమ్మిన దానిమీదనే నిలబడటము. అలాగే దృఢనిశ్చయత అనగా ఎలాగైనా సరే నేను సాధించాలి అనే తీర్మానము. ఈ లక్షణములు ఉంటే, విశ్వాసము సన్నగిల్లే పరిస్థితి వచ్చినా సరే ప్రభుబు మాటపై నిలబడగలిగే పరిపక్వత సాధించగలుగుతాము
“నీవు కలిగి ఉన్నావా?” అనే అంశము ద్వారా ప్రభువు ఈరోజు మనలను అడుగుతున్న ప్రశ్న, “నీవు అచంచలమైన పట్టుదల, దృఢనిశ్చయత కలిగి ఉన్నావా?
ప్రార్థన
ప్రియ పరలోకపు తండ్రీ, నీ అద్భుతమైన ప్రేమను బట్టి, కృపను బట్టి స్తోత్రములు. కొన్ని సార్లు పరిస్థితి కష్టముగా ఉన్నప్పటికీ మా ప్రార్థనలకు జవాబు కొంచెము ఆలస్యము అవ్వవచ్చు. అయితే నీవు మా నిశ్చయత ఎలా ఉంది? నిన్ను కేవలం అందరిలో ఒక సహాయముగా ఆశ్రయించామా? లేక నీవే మా సహాయము అని ఆశ్రయించామా అనే విషయము తేటపడటానికే అని తెలియచేసినందుకై వందనములు. పరిస్థితి ఏదైనా నీ మీద మాత్రమే ఆధార పడటం మాకు నేర్పించండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రీ, ఆమేన్!
0 Comments