02-Feb-2024 – మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవి?

Published by Sunil Binkam on

యేసు మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారి నడుగగా – మత్తయి 15:34

ఈరోజు దేవుడు “మీరు కలిగి ఉన్నారా?” అనే అంశం నుండి మనకు మరొక ప్రశ్న వేస్తున్నారు. మనము చదివిన వాక్యము మనకు సుపరిచితమే. ఒకనాడు పెద్ద జన సమూహము యేసయ్య మాటలు వినడానికి వచ్చింది. అయితే మూడు రోజులయినా సరే వారి ఆహారము గురించి ఆలోచించకుండా యేసయ్య మాటలు విన్నారు. ఆ తరువాత కూడా వారు ఆహారము కోసము యేసయ్యను అడగలేదు కానీ, యేసయ్యే వారి స్థితి గ్రహించినవాడై, తన శిష్యులను వారికి ఆహారము పెట్టమని అడిగాడు.

అయితే మనందరకు తెలిసినదే శిష్యులు యేసయ్యతో పాతే వచ్చారు. వారు ఇలా భోజనము వడ్డించవలసిన అవసరము ఉంది అని ముందుగా ఎరిగిలేరు కాబట్టి ఆహారము కొరకైన సిద్ధపాటు ఏమీ లేకుండానే అక్కడకు వచ్చారు. అయితే “మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి?” అని అడుగుతున్నారు. శిష్యులు వెంటనే జన సమూహములో వెతికి సమకూర్చమని అడుగుతున్నారని అర్హ్తము చేసుకుని అయిదు రొట్టెలు సమకూర్చగలిగారు. కానీ అక్కడ ఉన్న జనము 5000 మంది కంటే ఎక్కువైన పురుషులు. వారితో పాటు ఇంక స్త్రీలు చిన్నపిల్లలు కూడా ఉంటారు కదా!

5 రొట్టెలు ఉన్నాయి అని చెప్పగానే, యేసయ్య వరుసలో కూర్చోండి అని చెప్పారు. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న – ఒకవేళ మన దగ్గర ఉన్న వనరులు చాలా తక్కువగా ఉన్నప్పుడు, దేవుని మాట మాత్రము ఆ పరిస్థితి తృప్తి పరచబడే విధముగా వస్తుంటే, ధైర్యముగా నిలబడగలే విశ్వాసము మనకు ఉందా?

మన దైనందిన జీవితములలో అనేక సార్లు డబ్బు కోసమో, పనిలో సహాయము కోసమో, మాట సహాయము కోసమో, ఆదరణకోసమో ఇతరుల సహాయము మీద ఆధారపడతాము, ఎదురుచూస్తాము. అయితే సరిపడినంత సహాయం దొరకనప్పుడు, నీవు చదివే వాక్యము ద్వారానో, నీవు వెళ్ళే సంఘము ద్వారానో, ఇంకా వేర్వేరు విధానాలలో దేవుడు నీవు ధైర్యముగా నిలబడు అని చెప్తున్నాడు. ఇలాంటి అసాధ్యమైన పరిస్థితులలో దేవుడినుండి నేను ఖచ్చితముగా పొందుకుంటాను అనే విశ్వాసము కలిగిఉండాలి అని కోరుకుంటున్నాడు.

ఈ భాగమును నేను నా స్వంత అనుభవమునకు సరిపోల్చుకోగలను. నా జీవితములో దేవుని పిలుపును అనేక సంవత్సరముల ముందే నేను గ్రహించాను. దేవుని కృపను బట్టి అనేకమైన పరిచర్యలలో పాలు పంపులు కలిగిఉండే అవకాశము లభించింది. కొన్ని సంవత్సరముల క్రితము దేవుని ప్రేరేపణను బట్టి దేవుని గూర్చి ప్రకటించడానికి ఒక ఛానెల్ ప్రారంభించాను. అయితే నా స్వంత జీవితములో క్రమశిఖణాలేమి వలన కలిగే అపరాధ భావము వలన నిలకడగా చెయ్యలేకపోయాను.

అయితే 2024 లో వాచ్ నైట్ సర్వీస్ ద్వారా, నూతన సంవత్సర సందేశము ద్వారా దేవుడు ఇలా అనుదిన భాగము సిద్దపరచడానికి పురికొల్పాడు. నా పరిస్థితి పక్కన బెట్టి, దేవుడు ఇచ్చే వాక్యము కొరకు కనిపెట్టి అనుదిన భాగము పొందుపరచడానికి సిద్ధపడినప్పుడు, దేవుని విశ్వాస్యత నేను అనుభవించాను. ఇంతవరకు ఏ అంశము అయితే ప్రభువు ఇచ్చారో అదే అంశము కొరకైన వాక్యము, వివరణ దేవుడు అందిస్తూ వచ్చారు.

ఈ అనుభవము దేవుని కొరకు బలముగా మరిన్ని విషయములలో నిలబడటానికి నాకు ఖచ్చితముగా తోడ్పడుతుంది. ఈ చిన్న సాక్ష్యము మిమ్మును ఉత్తేజపరచింది అని నేను నమ్ముతున్నాను. ఒకవేళ దేవుడు మిమ్మును, “నీవు కలిగి ఉన్నావా” అని అడిగితే, “అవును ప్రభువా నేను నీ యందు విశ్వాసము కలిగి ఉన్నాను” అని చెప్పగలుగుతావా?

ప్రార్థన

ప్రేమగల పరలోకపు తండ్రీ, నీ అద్భుతమైన ప్రేమను బట్టి నీ విశ్వాస్యతను బట్టి నీకు ఋణపడి ఉంటాను. ఈరోజు అసాధ్యమైన పరిస్థితిలో అయినా సరే, నీ యందు నమ్మిక కలిగి ఉండుటకు అవసరమైన పాఠము నేర్చుకోవడానికి సహాయము చేసినందుకై వందనములు. నన్ను ప్రేమించే తండ్రిగా, సృష్టికర్తగా నేను తృప్తిపరచబడటానికై అవసరమైతే నూతనముగా సృష్టించగల సమర్థుడవు నీవు. నేను నిలబడగలుగుటకై సహాయము చెయ్యమని, యేసయ్య నామములో కృతజ్ఞతా స్తుతులు చెల్లించి అడిగి వేడుకుంటున్నాను తండ్రీ, ఆమేన్!


0 Comments

Leave a Reply

Avatar placeholder

Your email address will not be published. Required fields are marked *